Home రాజకీయాలు జీవితం నాశనం అయింది.. నేను అమ్ముడుపోయింది నిజమే

జీవితం నాశనం అయింది.. నేను అమ్ముడుపోయింది నిజమే

1967
SHARE

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సాక్షిగా తాను టీడీపీకి అమ్ముడుపోయానని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అంగీకరించారు. ఆ పని చేసి తాను తీవ్రంగా నష్టపోయానని ఆవేదన చెందారు.

తన రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకున్నానని చెప్పారు. కోడుమూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మణిగాంధీ అక్కడే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అందరిలాగా చంద్రబాబు అభివృద్ది కోసమే పార్టీ మారానని చెప్పబోనన్నారు. ఆత్మ సాక్షిగా చెబుతున్నా నేను టీడీపీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనే అని మణిగాంధీ స్పష్టం చేశారు.

చంద్రబాబు అభివృద్ధి చూసి పార్టీ మారామని అందరూ చెబుతున్నారని.. కానీ అలా చెప్పి తాను ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోబోనన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున 53వేల ఓట్ల మేజారిటీతో గెలిచానని.. చంద్రబాబు కంటే ఎక్కువ మెజారిటీ తనకు వైసీపీ తరపున వచ్చిందన్నారు. కానీ టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని వివరించారు.

పార్టీ సభ్యత్వాల కోసం 13.5 లక్షలు చెల్లిస్తే.. ఇప్పటి వరకు తనకు గానీ.. తన అనుచరులకు గానీ పార్టీ సభ్యత్వం కూడా రాలేదని.. అదీ టీడీపీలో తమ పరిస్థితి అని చెప్పారు మణిగాంధీ. టీడీపీకి రాజీనామా చేసే ఆలోచన ఉందన్నారు. మరో ఆరు నెలలు ఆగితే చాలా మార్పులు వస్తాయని.. ఏ నేత ఏపార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతాయని మణిగాంధీ అభిప్రాయపడ్డారు.

కోడుమూరు నియోజకర్గంలో హవా మొత్తం టీడీపీ ఇన్‌చార్జ్‌ విష్ణువర్థన్‌ రెడ్డితో నడుస్తోందన్నారు. తాను టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలు మానుకునేందుకైనా సిద్దమే గానీ.. విష్ణువర్థన్ రెడ్డితో కలిసి పనిచేసేది మాత్రం లేదని మణిగాంధీ కుండబద్దలు కొట్టారు.