Home రాజకీయాలు జగన్‌పై స్వరూపనందేంద్ర సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై స్వరూపనందేంద్ర సంచలన వ్యాఖ్యలు

SHARE

జగన్ ఇలాంటి వాడని తాను ఇది వరకు ఊహించలేదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి చెప్పారు. గతంలో టీవీల్లో జరుగుతున్న ప్రచారం చూసి తాను కూడా జగన్‌ హిందూవ్యతిరేకి అని భావించానన్నారు.

సామాన్య ప్రజల తరహాలోనే మీడియా ప్రచారం చూసి తాను అలాగే భావించానని చెప్పారు. కానీ 2014 ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ తన వద్దకు వచ్చినప్పుడు అసలు విషయం అర్థమైందన్నారు. జగన్‌పై టీవీ చానళ్లు ఏ స్థాయిలో అసత్యప్రచారం చేశాయో తాను అప్పుడు తెలుసుకున్నానని చెప్పారు.

జగన్‌లో హిందూవ్యతిరేక లక్షణాలు తనకు కనిపించలేదని చెప్పారు. జగన్‌ ధర్మం తెలిసివాడని తాను నిర్ధారించుకున్నానన్నారు. అబద్దాలు చెప్పకపోవడమే తనకు జగన్‌ వద్ద బాగా నచ్చిన విషయం అన్నారు. ఒకవేళ జగన్‌ నాటకాలు ఆడి.. అబద్దాలు చెప్పి ఉంటే 2014లోనే ముఖ్యమంత్రి అయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.

నాటకాలు ఆడడం, అబద్దాలు చెప్పడం చేతగాని వ్యక్తి జగన్‌ అని తనకు అర్థమైందన్నారు. తాను సీఎం అయితే గ్రామాల్లోని దేవాలయాలన్నింటిని పునరుద్దరించి ఆ గ్రామంలోని అర్చకుల ఆధ్వర్యంలోనే నడిచేలా చేస్తానని జగన్‌ చెప్పారని అది తనకు బాగా నచ్చిందన్నారు.

ఇంతటి అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో ఎన్నో జరగకూడని పనులు జరుగుతున్నాయని.. అందుకే తాను వాటిని విమర్శిస్తుంటానని చెప్పారు. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు ఎవరో చేశారో తేల్చి ప్రజలకు తెలియజేసి ఉంటే అందరూ ఆనందించేవారన్నారు.

అలా కాకుండా కేవలం ఈవోను బదిలీ చేసి వ్యవహారానికి ముగింపు పలికితే అనుమానాలు మరింత పెరగవా అని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగింది 100 శాతం నిజమని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌లో మొండి తనం ఉంది కాబట్టే పాదయాత్రతో పాటు ఎన్నో చేయగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తప్పులు చేసినా ప్రశ్నించే వారిలో తానే ముందుంటానని స్వరూపనందేంద్ర సరస్వతి చెప్పారు.