Home రాజకీయాలు నాడు నీతులు చెప్పి… నేడు గీతలు దాటి..

నాడు నీతులు చెప్పి… నేడు గీతలు దాటి..

SHARE

చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తీరు పదేపదే వివాదాస్పమవుతూనే ఉంది. మంత్రి కాకముందే నారా లోకేష్ సీఎంవోకు రావడం, మంత్రులతో సమీక్షలు చేయడం వంటివి చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో లోకేష్‌ను చంద్రబాబు ఏకంగా మంత్రిని చేసేశారు.

కానీ మిగిలిన కుటుంబసభ్యులు కూడా పాలనలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా ముకేఖ్‌ అంబాని వచ్చిన సమయంలో నారా బ్రహ్మణి, భువనేశ్వరి తీరు వివాదాస్పదం, చర్చనీయాంశమైంది. సెలవు రోజుగా అంబానీ చంద్రబాబును కలిసేందుకు వచ్చారు.

అంబానీ పర్యటనలో ఏ ఒక్క మంత్రిని ఇన్వాల్వ్ చేయలేదు చంద్రబాబు. కేవలం నారా లోకేష్‌, తను మాత్రమే అంబానితో భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన అంబానిని కలిసేందుకు నారా బ్రహ్మణి, భువనేశ్వరి నేరుగా సచివాలయం వచ్చేశారు.

నేరుగా వెళ్లి సీఎం కార్యాలయంలో కూర్చున్నారు. ఇలా వచ్చేందుకు వారికి ఎలాంటి అధికారం లేదు. కానీ సీఎం కుటుంబసభ్యులు నేరుగా అంబానీతో చర్చలు జరిపేందుకు సచివాలయం వచ్చారు. చరిత్రలో ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ఇలా నేరుగా సచివాలయానికి వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీ పర్యటన ప్రభుత్వపరంగా జరిగిందా లేక హేరిటేజ్ సంస్థ పరంగా జరిగిందా అన్నది అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. ఇప్పటికే రిలయన్స్‌ సంస్థలకు కేజీ బేసిన్‌ గ్యాస్‌ను కట్టబెట్టిన చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

రిలయన్స్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు రాష్ట్రంలో రేషన్ షాపులను ఎత్తేసి వాటి స్థానంలో చంద్రన్న మాల్స్‌ను ఏర్పాటు చేస్తూ వాటి బాధ్యతను 10 జిల్లాల్లో రిలయన్సేకే చంద్రబాబు అప్పగించారు.

ఇలా ఎంతో బలోపేతమైన ఆర్ధిక వ్యాపార సంబంధాలు రిలయన్స్‌తో ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న వేళ.. ఇప్పుడు ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు నేరుగా అంబానీ పర్యటన సందర్భంగా సచివాలయానికి వచ్చి సీఎంవోలో హల్ చల్‌ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు పలు విమర్శలు చేసేశారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చక్రం తిప్పుతున్నారంటూ ఆరోపణలు చేసేవారు. కానీ జగన్ ఒకరోజు సచివాలయానికి వచ్చినట్టు గానీ.. ఒక్క అధికారికి ఫోన్ చేసినట్టుగానీ నిరూపించాలని నాడు వైఎస్‌ వర్గీయులు ప్రతిసవాల్ చేసేవారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం కుమారుడు, భార్య, కోడలు, బామ్మర్ది అంతా నేరుగా పాలనతో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు.