Home రాజకీయాలు ఏపీలో ఆ సామాజికవర్గాల ఓట్లనే కోసేశారా?

ఏపీలో ఆ సామాజికవర్గాల ఓట్లనే కోసేశారా?

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చట్టం అధికార పార్టీ చుట్టమైపోయింది. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన చర్యకు కూడా అధికారపార్టీ తెగించినట్టుగానే ఉంది. చివరకు ప్రత్యర్థుల ఓట్లను కూడా లేకుండా చేసేందుకు అధికారులతో కలిసి అధికార పార్టీ నేతలు తెగించారు. అధికారుల ముసుగులో ఉన్న కొందరు టీడీపీ సానుభూతిపరులు ఓట్ల గల్లంతులో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తూ తమ బాబును శాశ్వతంగా అధికారంలో నిలపాలని ఉరకలేస్తున్నారు.

ఓట్ల తొలగింపు వ్యవహారం తొలుత గుంటూరు జిల్లాలో బహిర్గతమైంది. అక్కడి వైసీపీ నేతలు అప్రమత్తం కావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి, నరసనరావుపేట నియోజకవర్గాల్లో ఓట్ల గల్లంతు పక్కాగా సాగించారు. చివరకు అంబటి రాంబాబు కుటుంబం ఓట్లు మొత్తం తొలగించారు.

గుంటూరు జిల్లాలోనే ఇతర జిల్లాల్లోనూ ఈ తంతు సాగిందా అంటే వైసీపీ నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ చాలా చోట్ల భారీగా ఓట్లను మాయం చేశారు. అధికార పార్టీకి మేలు చేసే పద్దతుల్లోనే ఈ ఓట్ల తొలగింపు సాగిందని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి మద్దతు దారులుగా ఉంటాయని భావించే సామాజివర్గాల ఓట్లను పనిగట్టుకుని తీసేశారు. అలా ఓట్లు గల్లంతు అయిన వర్గాల్లో ముస్లిములు, క్రిస్టియన్లు, దళితులు, రెడ్లు, కాపులు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. గ్రామాల్లో వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న ఇతర వర్గాల వారి ఓట్లను కూడా అధికార పార్టీ కనుసన్నల్లో తొలగింపు జరిగినట్టు అంచనాకు వస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో రెడ్డి అని కనిపిస్తే చాలు సదరు ఓటును తొలగించినట్టు చెబుతున్నారు. సత్తెనపల్లిలో అంబటిరాంబాబును దెబ్బతీసేందుకు కాపుల ఓట్లను భారీగా కోసేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాసరావులు కలిసి ఈ తంతు నడిపినట్టు అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా వైసీపీ నేతలు అప్రమత్తమవడంతో ఇక్కడి వ్యవహారం బయటపడింది. మిగిలిన జిల్లాల్లో వైసీపీ నేతలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. విద్యావంతులు ఒకసారి ఆన్‌లైన్‌ ద్వారానైనా తమ ఓటు పరిస్థితిని తెలుసుకోవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.