Home రాజకీయాలు ఏపీ ఎంపీలకు మద్దతు తెలిపిన కవిత !

ఏపీ ఎంపీలకు మద్దతు తెలిపిన కవిత !

SHARE

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని పార్లమెంట్‌లో నినదించిన ఏపీ ఎంపీలకు రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టీఅర్ఎస్ ఎంపీ కవిత కూడా ఏపీ ఎంపీ లకు తన మద్దతునిచ్చారు. ఏపీ ఎంపీలు చేసే ఆందోళనలో నిజముందని ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత లోక్ సభలో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కున్న సమస్యలతో పాటుగా తెలంగాణ సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.

కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంపీలు నాలుగురోజులుగా నిరసన చేస్తున్నారని, తమ మద్దతును వారికీ తెలుపుతున్నామని అన్నారు. అయితే కేంద్రంలో మిత్రపక్షం ఇలా ఆందోళన చేస్తే బయటకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కవిత అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీల సమస్యల్ని అర్ధం చేసుకుంటే బాగుంటుందని, అర్ధం చేసుకోవాలని అన్నారు.

రైతాంగం కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే… వారి ఆశలు అడియాశలు ఆయ్యాయని పేర్కొన్నారు. కేంద్రం రైతాంగంకు మరోసారి అన్యాయం చేసిందని అన్నారు. తెలంగాణాలో రైతాంగానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు అని కాబట్టి దానిని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని కోరారు. రైతులకు సూక్ష్మ సేద్యానికిచ్చే 35శాతం రాయితీని తక్షణమే అందచేయాలని అన్నారు. రైతులు ఏడాదంతా కష్టపడి పండించుకునే పంటలన్నిటిని సేకరించి వాటికీ సరైన గిట్టుబాటు ధరను ఇవ్వాలని డిమాండ్ చేశారు.