Home రాజకీయాలు నేను వెనక్కు తగ్గను.. కావాలంటే నన్ను బహిష్కరించండి..

నేను వెనక్కు తగ్గను.. కావాలంటే నన్ను బహిష్కరించండి..

SHARE

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్ ఆర్డర్‌తో చైర్మన్ వెంకయ్యనాయుడుతోపాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇరుకునపడ్డారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ఆందోళనకు దిగిన నేపథ్యంలో సుజనా చౌదరి స్పందించారు. మూడున్నరేళ్లుగా విభజనహామీలను నెరవేర్చడంతో ప్రభుత్వం విఫలమైందని అంగీకరించారు.

విభజన చట్టం అమలుపై 15 రోజుల్లో   కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ  స్పందించాలని కోరారు.   దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75లను ప్రస్తావించారు. కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రి సభలో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం రాజ్యాంగ విరుద్దమని ఆర్టికల్స్‌ను చదివి వినిపించారు.

కేబినెట్‌ నిర్ణయాలు సమిష్టి బాధ్యత అని.. దాన్ని సుజనా ఉల్లంఘించారని చెప్పారు. అలా చేసిన వ్యక్తికి మూడే మార్గాలు ఉంటాయని చట్టాన్ని గుర్తు చేశారు. సొంత కేబినెట్‌పై వ్యతిరేకంగా మాట్లాడాలంటే ముందు రాజీనామా చేయాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. అలా చేయని పక్షంలో సొంత కేబినెట్‌లపై అవిశ్వాసం ప్రకటించిన మంత్రిపై ప్రధాని వేటు వేయాలని రాజ్యాంగం చెబుతోందన్నారు.

కాబట్టి సుజనాపై రూలింగ్ ఇవ్వాలని విజయసాయిరెడ్డి పట్టుపట్టారు. అయితే చైర్మన్ వెంకయ్యనాయుడు మాత్రం సుజనాను వెనుకేసుకొచ్చారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వొచ్చని చెప్పారు. ఇందుకు విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేబినెట్ అమోదించిన ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వొచ్చనది రాజ్యాంగంలో ఎక్కడా లేదని వాదించారు. విజయసాయిరెడ్డి తన ఆందోళన కొనసాగించారు. దీంతో వెంకయ్యనాయుడు … ఆందోళన చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డిని హెచ్చరించారు.

వెంటనే సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి… సభాధ్యక్షుడు రాజ్యాంగానికి విరుద్దంగా సభ నడపడం బాధకరమన్నారు. చైర్మనే ఇలా చేస్తే ఎలా అని నిలదీశారు. రాజ్యాంగానికి విరుద్దంగా వెంకయ్యనాయుడు రూలింగ్ ఇవ్వడంతో పాటు నిరసన తెలిపిన తనపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం సరికాదన్నారు.

రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్దంగా వ్యవహారాలు నడుపుతామంటే తాను ప్రతిఘటిస్తూనే ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ ప్రయత్నంలో తనను సస్పెండ్ చేసినా.. ఏకంగా సభ నుంచి ఎక్స్ పెల్ చేసినా సరే అందుకు తాను సిద్ధమని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి స్పష్టం చేసినట్టు విజయసాయిరెడ్డి వివరించారు. రాజ్యాంగ విరుద్దంగా సభను నడుపుతున్న వెంకయ్యనాయుడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.