Home రాజకీయాలు తోక పత్రిక పవన్‌ను మరో పొట్టి శ్రీరాముల్ని చేయాలనుకుందా?

తోక పత్రిక పవన్‌ను మరో పొట్టి శ్రీరాముల్ని చేయాలనుకుందా?

1343
SHARE

టీడీపీని సంక్షోభం చుట్టుముట్టిన ప్రతిసారీ.. చంద్రబాబుకు ఊపిరి సడలని పరిస్థితులు చుట్టుముట్టిన ప్రతిసారీ పవన్‌ కల్యాణ్ ఆపద్భాందవుడిగా తెరపైకి వస్తుంటారన్న విమర్శ ఉంది. పవన్‌ కల్యాణ్ టీడీపీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో ప్రచారం కల్పించడానికి  కూడా కారణం అదేనని చెబుతుంటారు.

అయితే కేంద్ర బడ్జెట్‌పై లేటుగానైనా పవన్‌ స్పందించారు. కాకపోతే పవన్‌ ప్రెస్‌ మీట్‌కు కొన్ని గంటల ముందు టీడీపీ తోక పత్రికగా ముద్ర ఉన్న మీడియా సంస్థ.. పవన్‌పై ఆసక్తికరంగా కథనాలు రాసింది.

పవన్‌ ఢిల్లీని గడగడలాడించబోతున్నారని వెల్లడించింది. మోడీకి సవాల్‌ చేసేందుకు జనసేనాని సిద్ధమయ్యారని వెల్లడించింది. అంతటితో ఆగకుండా హోదా కోసం పవన్ కల్యాణ్ ఢిల్లీ జంతర్‌ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారని … ఈ విషయం జనసేన వర్గాలు తమతో చెప్పాయని రాసుకొచ్చింది.

మరో అడుగు ముందుకేసి ఈనెల 21న పవన్‌ ఆమరణ దీక్ష అని.. కత్తి మహేష్ కూడా మద్దతు ప్రకటించారని సీరియస్‌గా కథనాలు రాసింది. ఆ మీడియా సంస్థ రాసిన కథనాలు చూస్తే ప్రత్యేక హోదా కోసం పవన్‌ మరో పొట్టి శ్రీరాములయ్యేందుకు సిద్ధపడ్డారా అన్న రేంజ్‌లో ఉన్నాయి.

కానీ ఆ తర్వాత పవన్‌ కల్యాణ్ ప్రెస్‌మీట్‌లో అసలు విషయం తెలిసిపోయింది. ఆమరణ దీక్ష లేదు.. రిలే నిరాహార దీక్ష లేదు. హోదా కోసం ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, జేపీ లాంటి వారితో జేఏసీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని.. ఆ విషయం చెప్పడానికే  తాను ప్రెస్‌మీట్ పెట్టానని చెప్పి తుస్సుమనిపించారు పవన్.

అప్పటి వరకు టీడీపీ తోక మీడియా కథనాలు చూసి పవన్‌ నిజంగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తారని అనుకున్న వారికి దిమ్మతిరిగినంత పనైంది. సదరు మీడియా పవన్‌ను లేపేందుకు ఈ ప్రయత్నం చేసిందా.. లేక.. పవన్‌ను మరోసారి అభాసుపాలు చేసేందుకు ఈ ఎత్తు వేసిందా అన్నది వారికే తెలియాలి.