Home రాజకీయాలు ఇక మేం ఎవరితో చెప్పుకోవాలి సర్‌- సభలో సాయిరెడ్డి ఉద్వేగ ప్రసంగం

ఇక మేం ఎవరితో చెప్పుకోవాలి సర్‌- సభలో సాయిరెడ్డి ఉద్వేగ ప్రసంగం

1665
SHARE

బడ్జెట్‌లో అన్యాయంపై అరుణ్‌ జైట్లీ ప్రకటనతో టీడీపీ ఎంపీలు వెనక్కు తగ్గారు. ఉభయసభల్లో ఆందోళన విరమించారు. వైసీపీ ఎంపీలు మాత్రం ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.

రాజ్యసభలో విభజన హామీలు, బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు. విభజన సమయంలో అన్యాయమైన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకు ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలనే అమలు చేయకపోతే ఇక మేం ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని అడగాలి అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇదే రాజ్యసభ అంగీకరించిందని గుర్తు చేశారు. ఆసమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా హోదా ఇవ్వాలని పట్టుపట్టిందన్నారు. ఇప్పుడు మాత్రం 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెబుతుందని చెప్పడం సరికాదన్నారు.

ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. రాష్ట్ర విభజనతో ఐటీ రంగం, ఫిల్మ్‌ ఇండస్ట్రీ, అన్ని ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌లోని ఉండిపోయి తెలంగాణకు వెళ్లిపోయాయన్నారు.

ఏపీకి మాత్రం ఏమీ మిగల్లేదన్నారు. అందుకే ఏపీని రక్షించడం కోసం ప్రత్యేకహోదా ఇస్తామన్నారని.. ఇప్పుడు మాత్రం హామీలు నెరవేర్చడం లేదని సాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ కూడా తన మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు.

నాలుగేళ్లు గడిచిపోయిందన్నారు. కానీ చట్టంలోని అంశాలను మాత్రం అమలు చేయడం లేదని.. కేంద్ర ప్రభుత్వమే ఇలా చేస్తే తామెవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందారు.

కడప స్టీల్ ఫ్యాకర్టీ, విశాఖ రైల్వే జోన్, విశాఖ- చెన్నై కారిడర్, విశాఖ మైట్రో, విజయవాడ మెట్రో ఇలా ఎన్నో చెప్పారని.. కానీ వాటిలో ఏవీ కూడా అమలు కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలు, రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు తీవ్ర వెనుకుబాటుతో అల్లాడుతున్నాయన్నారు.

బుందేల్‌ఖడ్‌ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి.. జిల్లాకు 50 కోట్ల చెప్పున ఇచ్చారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాలకు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. ఇలా అయితే ఆంధ్రప్రదేశ్‌ ఎలా బతకాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే తమ పట్ల ఇలా వ్యవహరిస్తే తామె ఎక్కడికి పోవాలని విజయసాయిరెడ్డి ఆవేదన చెందారు.