Home రాజకీయాలు వైసీపీ తిరగబడినట్టే.. రాజ్‌నాథ్‌ ఫోన్‌పైనా ఉండవల్లి సెటైర్లు

వైసీపీ తిరగబడినట్టే.. రాజ్‌నాథ్‌ ఫోన్‌పైనా ఉండవల్లి సెటైర్లు

273
SHARE

ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో నాలుగేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని.. ఇప్పుడు కొత్తగా జరుగుతున్నట్టు టీడీపీ హడావుడి చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఇప్పటికీ బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో 2652 కోట్లు కేటాయిస్తే.. ఏపీకి మాత్రం 1939 కోట్లు మాత్రమేకేటాయించారని ఉండవల్లి విమర్శించారు. అయినప్పటికీ మిత్రధర్మం అంటూ టీడీపీ మౌనంగా ఉండడం సరికాదన్నారు. పార్లమెంట్‌లో వెల్‌లోకి వెళ్లి ఆందోళనలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చంద్రబాబుకు వ్యతిగత హోదాలో ఫోన్ చేసి మాట్లాడితే ఏం ఉపయోగమని ప్రశ్నించారు. చెప్పుతో కొట్టి ఓదార్చినట్టుగా ఉందన్నారు. మా వాళ్ల చెప్పుతో కొట్టారట కదా.. ఏ చెప్పుతో కొట్టారు.. వెనుక నుంచి కొట్టారా.. ముందు నుంచి కొట్టారా అని ఆరా తీసినట్టుగా రాజ్‌నాథ్‌ సింగ్ వ్యవహారం ఉందన్నారు.

చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై విపరీతమైన పట్టు ఉందని.. అయినప్పటికీ మోడీని ధిక్కరించేందుకు భయపడుతున్నారంటే… బహుశా ఏకంగా లేపేస్తారేమోనన్న భయం చంద్రబాబుకు ఉంది కాబోలు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో వైసీపీ 184 రూల్‌ కింద నోటీసులివ్వడం మంచి పరిణామమేనన్నారు.

ఆ రూల్‌ కింద చర్చ జరిగితే తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఒక విధంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ తిరగబడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ చర్య వల్ల కనీసం మరోసారి ఆంధ్రా సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు. టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తుందో లేదో కూడా తేలిపోతుందన్నారు.  టీడీపీ మాత్రం సోమువీర్రాజు ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉన్నట్టుగా ఉందన్నారు.

జైలుకు పంపుతారేమోనని ఒక ముఖ్యమంత్రి భయపడుతూ కూర్చోవడం అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు. జైలుకు భయపడే వాడు రాజకీయాలు చేయడం వేస్ట్ అన్నారు. ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులను పట్టించుకోవద్దని కేంద్రానికి చంద్రబాబు కోరడం అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఉండవల్లి. కాకినాడలో నెలకొల్పాల్సిన పెట్రోలియం రిఫైనరీని ముంబాయికి తరలిస్తున్నా టీడీపీ ఎంపీలు మిత్రధర్మం అంటూ మౌనంగా ఉండడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.