Home రాజకీయాలు నేను మీవాడిని కాదా?- ఫిరాయింపు ఎమ్మెల్యే ఆవేదన

నేను మీవాడిని కాదా?- ఫిరాయింపు ఎమ్మెల్యే ఆవేదన

264
SHARE

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు రాజకీయ జీవితం ప్రశ్నార్థకమవుతోంది. గెలిచిన పార్టీని వదిలేసి అధికారపార్టీలో చేరిన ఆయనకు అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి. ఆ పరిస్థితిని తట్టుకోలేక జయరాములు ఏకంగా ఆదివారం బద్వేల్‌లో మీడియాసమావేశం పెట్టి తన గోడు వెళ్లబోసుకున్నారు.

తాను టీడీపీ ఎమ్మెల్యేను కాదా అని ప్రశ్నించారు. తాను అభివృద్ధి కోసం నిస్వార్థంగా పార్టీ మారితే.. టీడీపీలోని మరో వర్గం నేతలు ఇబ్బందులుపెడుతున్నారని వాపోయారు. తమను కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని ఆవేదన చెందారు. పేరుకు తాను ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా మరో వర్గం చెలాయిస్తోందన్నారు.

నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా టీడీపీలోని ఆ వర్గం అడ్డుపడుతోందటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మపై విరుచుకుపడ్డారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇతర నేతలు కూడా ఆమెకు వంతపాడుతున్నారని.. దీని వెనుక మర్మమేంటని జయరాములు ప్రశ్నించారు.

బద్వేలు నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్లు మంజూరు చేయించామని, అయితే తనకు తెలియకుండా సబ్‌స్టేషన్‌లో నియామకాలు జరిగిపోవడం చూస్తే తాను టీడీపీ ఎమ్మెల్యేను కాదా అని ఆయన ప్రశ్నించారు. నీరు- చెట్టు పనులన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఒక్క పని కూడా మంజూరు చేయలేకపోయానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పాత టీడీపీ నేతలు మాత్రం… పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము నిలబడి ఎన్నో త్యాగాలు చేశామని… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అధిపత్యం చెలాయిస్తామంటే తామెందుకు అంగీకరిస్తామని ప్రశ్నించారు. మొత్తం మీద ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు పరిస్థితి ఇలా ఉందన్న మాట.